రాంచీ మ్యాచ్ సందర్భంగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో ప్రత్యక్షమైన ధోనీ

22-10-2019 Tue 15:27
  • నదీమ్ తో మాట్లాడుతున్న ఫొటో షేర్ చేసిన బీసీసీఐ
  • ఇక్కడెవరున్నారో చూడండి అంటూ బీసీసీఐ ట్వీట్
  • ధోనీని చూడటం గొప్పగా ఉందన్న రవిశాస్త్రి

రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు, రాంచీకి చెందిన ధోనీ ఈ మ్యాచ్ సందర్భంగా ప్రత్యక్షమయ్యాడు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో తళుక్కున మెరిశాడు. జార్ఖండ్ కే చెందిన బౌలర్ షాబాజ్ నదీమ్ తో మాట్లాడుతూ, సూచనలు ఇస్తూ, అతడిలో విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. నదీమ్ ఈ మ్యాచ్ ద్వారానే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ లో 4 వికెట్లు పడగొట్టాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ధోనీ ఉన్న ఫొటోలను బీసీసీఐతో పాటు రవిశాస్త్రి ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ఇక్కడెవరున్నారో చూడండని బీసీసీఐ ట్వీట్ చేయగా... ఒక గొప్ప సిరీస్ విజయం తర్వాత భారత దిగ్గజ ఆటగాడిని ఆయన సొంత డెన్ లో చూడటం గొప్పగా ఉందని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు.