Bay Of Bengal: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో మరింతగా వర్షాలు

  • రేపటికి బలపడనున్న అల్పపీడనం
  • ఉత్తర వాయవ్య దిశగా పయనించే అవకాశం
  • మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్న అధికారులు

ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా వర్షాభావంతో కరవు పరిస్థితుల్లోకి జారుకుంటున్న దక్షిణ కోస్తా జిల్లాలకు ఊరట కలిగించేలా వర్షపాతం నమోదవుతోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుండడంతో మరిన్ని వర్షాలకు అవకాశం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది.

కాగా, అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడి ఉత్తర వాయవ్య దిశగా పయనించనుంది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

More Telugu News