తీరిన టీటీడీ చిల్లర కష్టం... చిత్తూరు నుంచి తిరుపతికి ఆర్బీఐ చెస్ట్!

22-10-2019 Tue 12:10
  • ఏళ్ల తరబడి పేరుకుపోయిన చిల్లర నాణాలు
  • గత రెండు నెలల్లో రూ. 26 కోట్ల చిల్లర మార్పిడి
  • టీటీడీ కోరికపై సానుకూలంగా స్పందించిన ఆర్బీఐ

ఏళ్ల తరబడి భక్తులు సమర్పించిన చిల్లర కానుకలను నిల్వ చేయలేక, మార్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడిన, తిరుమల తిరుపతి దేవస్థానం కష్టాలు ఎట్టకేలకు తీరిపోయాయి. గత రెండు నెలల్లో మొత్తం రూ. 26 కోట్ల విలువైన చిల్లర నాణాలను ఆర్బీఐ తీసుకుంది. మరో రూ. 5 కోట్ల విలువైన నాణాలు మాత్రం టీటీడీ వద్ద ఇంకా మిగిలివుండగా, నెలాఖరులోగా వాటిని కూడా మారుస్తామని అధికారులు అంటున్నారు.

కాగా, ప్రస్తుతం చిత్తూరులో ఉన్న ఆర్బీఐ చెస్ట్ ను తిరుపతికి తరలించాలని టీటీడీ కోరగా, అందుకు ఆర్బీఐ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఆర్బీఐ చెస్ట్ ను తిరుపతిలో ఏర్పాటు చేస్తే, చిల్లర నాణాల మార్పిడితో పాటు, నోట్ల డిపాజిట్ కూడా సులభతరం అవుతుందని టీటీడీ భావిస్తోంది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఉన్నతాధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.