పవన్ ను ఒప్పించేందుకు దిల్ రాజు ప్రయత్నాలు?

22-10-2019 Tue 11:01
  • హిందీలో విజయవంతమైన 'పింక్'
  • తమిళంలోను హిట్ టాక్ సొంతం 
  •  తెలుగు రీమేక్ కి సన్నాహాలు 

పవన్ కల్యాణ్ తిరిగి సినిమాలు చేయనున్నాడనే టాక్ కొంతకాలంగా వినిపిస్తూనే వుంది. ఇటీవల ఆయన కథలు వింటున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది ఆయన దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

2016లో హిందీలో వచ్చిన 'పింక్' మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అమితాబ్ - తాప్సీ ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమా, కథాకథనాలపరంగా ప్రశంసలు అందుకుంది. ఇటీవల అజిత్ - శ్రద్ధా శ్రీనాథ్ లతో తమిళంలోకి రీమేక్ చేయబడిన 'పింక్' అక్కడ కూడా ఘన విజయాన్ని సాధించింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు హక్కులను దక్కించుకున్న దిల్ రాజు, పవన్ తో ఈ రీమేక్ చేయాలనే ఉద్దేశంతో వున్నారు. 'కేవలం 25 రోజులు .. అదీ ఎప్పుడు వీలైతే అప్పుడు కేటాయిస్తే చాలు' అని పవన్ కి త్రివిక్రమ్ ద్వారా కబురు పంపినట్టుగా చెప్పుకుంటున్నారు. చాలా తక్కువ రోజులే గనుక, పవన్ ఈ ప్రాజెక్టు పట్ల మొగ్గు చూపుతున్నాడని అంటున్నారు. దిల్ రాజు ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.