Pooja Junnoor: సమయానికి అంబులెన్స్ రాక... మరాఠీ సినీ నటి దుర్మరణం!

  • రెండు సినిమాలతోనే పేరు తెచ్చుకున్న పూజా జుంజార్
  • గర్భం దాల్చిన తరువాత నటనకు దూరం
  • తొలుత బిడ్డ, ఆపై తల్లి కన్నుమూత

సమయానికి అంబులెన్స్ చేరుకోలేని కారణంగా ఓ ప్రముఖ మరాఠీ నటి మరణించిన ఘటన విషాదాన్ని నింపింది. ఈ ఘటన మహారాష్ట్రకు 590 కిలోమీటర్ల దూరంలోని హింగోలి జిల్లాలో జరిగింది. జిల్లాకు చెందిన పూజా జుంజార్ (25) మరాఠీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఆమె ప్రస్తుతం గర్భవతి. పురిటి నొప్పులతో పూజా బాధపడుతుండగా, ప్రసవం కోసం ఆమెను తొలుత గోరేగాంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె ఓ శిశువుకు జన్మనివ్వగా, పుట్టిన కాసేపటికే పాప తీవ్ర అనారోగ్యంతో మృత్యువాత పడింది.

పూజా జుంజార్ పరిస్థితి కూడా విషమంగా ఉందని గ్రహించిన వైద్యులు, వెంటనే హింగోలీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. హింగోర్ ఆసుపత్రి అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయితే, ఆమెను తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లభించలేదు. ఆమె బంధువులు ఓ ప్రైవేటు అంబులెన్స్ ను తెచ్చి, పెద్దాసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో ప్రాణాలు పోయాయి.

సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతోనే, వైద్యం అందక తమ బిడ్డ మరణించిందని కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రెండు మరాఠీ చిత్రాల్లో నటించిన ఆమె, గర్భం దాల్చిన తరువాత నటనకు విరామం తీసుకుంది.

More Telugu News