Jammu And Kashmir: కశ్మీర్ అంశంలో ఇండియాకు మద్దతు ఇస్తూనే మరోసారి ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా

  • కశ్మీర్ లోయలోని 80 లక్షల మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు
  • జమ్ము, లడఖ్ లలో పరిస్థితులు మెరుగుపడ్డాయి
  • కశ్మీర్ ఇంకా సాధారణ స్థితికి రాలేదు

కశ్మీర్ అంశంపై అమెరికా మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత.. ఆ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు పలుకుతున్నామని తెలిపింది. అయితే, కశ్మీర్ లోయలో కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితిపై మాత్రం కొంత ఆందోళనగా ఉందని చెప్పింది. ఆగస్టు 5 నుంచి ఇప్పటి వరకు కశ్మీర్ లోయలోని 80 లక్షల మంది ప్రజల రోజువారీ జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపింది. జమ్మూకశ్మీర్ లోని పరిస్థితిని తాము నిశితంగా గమనిస్తున్నామని చెప్పింది.

జమ్ము, లడఖ్ లలో పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయని... కానీ, కశ్మీర్ లోయ మాత్రం ఇంకా సాధారణ స్థితికి రాలేదని అమెరికా తెలిపింది. కశ్మీర్ లోయలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలను దిగ్బంధించడంపై తమ ఆందోళనను భారత ప్రభుత్వానికి తెలియజేశామని వెల్లడించింది.

మానవహక్కులను గౌరవించాలని... ఇంటర్నెట్, మొబైల్ సేవలను పునరుద్ధరించాలని భారత ప్రభుత్వాన్ని కోరామని తెలిపింది. జమ్మూకశ్మీర్ లో మారుతున్న పరిణామాలను జర్నలిస్టులు కవర్ చేసినప్పటికీ... సెక్యూరిటీ ఆంక్షల వల్ల వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పింది.

More Telugu News