సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

22-10-2019 Tue 07:16
  • మాస్ పాట కోసం తమన్నా వెయిటింగ్
  • డిసెంబర్లో విజయ్ దేవరకొండ సినిమా 
  • చిరంజీవి కోసం కథ రెడీ చేసిన సందీప్ రెడ్డి

*  మహేశ్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో అందాలతార తమన్నా ఓ స్పెషల్ సాంగును చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పాటను వచ్చే నెల మొదటి వారంలో సెట్స్ లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై తమన్నా చెబుతూ, 'నేను ఓ మాస్ పాటకు డ్యాన్స్ చేసి చాలా రోజులైంది. అందుకే ఈ పాట కోసం ఎదురుచూస్తున్నాను. పైగా దేవిశ్రీ ట్యూన్ అంటే మరీ హుషారు వచ్చేస్తుంది' అని చెప్పింది.
*  విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రం చివరి షెడ్యూలు షూటింగ్ త్వరలో మొదలవుతుంది. నవంబర్ నెలాఖరుకి షూటింగును పూర్తిచేసి, డిసెంబర్లో చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్మాత కేఎస్ రామారావు ప్లాన్ చేస్తున్నారు.  
*  'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' చిత్రాలతో విజయాలు సాధించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన తదుపరి చిత్రాన్ని 'కబీర్ సింగ్' నిర్మాతలతో చేయనున్న సంగతి విదితమే. ఇదిలావుంచితే, తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ కథను తయారుచేశాడట. త్వరలో ఆయనకు వినిపించడానికి రెడీ అవుతున్నాడు.