Chittoor District: మురుగుకాల్వలో ఐదు కిలోల నగలు.. పంచుకున్న పారిశుద్ధ్య కార్మికులు.. అసలు విషయం తెలిసి అవాక్కు!

  • ఆంధ్రాబ్యాంకులో పది రోజుల క్రితం చోరీకి గురైన నగలు
  • కాల్వ శుభ్రం చేస్తుండగా దొరికిన నగల మూట
  • అవి గిల్టునగలని చెప్పడంతో కార్మికుల షాక్

మురుగుకాల్వను శుభ్రం చేస్తున్న ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులకు 5 కిలోలకుపైగా ఆభరణాలు దొరికిన ఘటన చిత్తూరులో జరిగింది. ఆభరణాల్లో గాజులు, 25 రకాల కమ్మలు, 80 హారాలు, ఉంగరాలు ఉన్నాయి. అవి చూసిన వారి గుండె ఆగినంత పనైంది. దొరికిన మూటతో రహస్య ప్రదేశానికి చేరుకున్న ఇద్దరూ ఆభరణాలను సమంగా పంచుకున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి మామూలుగానే రోజువారీ విధులకు హాజరవుతున్నారు.

తాజాగా, సోమవారం నలుగురు పోలీసులు కార్మికుల ఇంటికి చేరుకుని నగల గురించి ప్రశ్నించడంతో షాకయ్యారు. నగల సంచి ఇవ్వాలని కోరారు. దీంతో తమకు అటువంటిదేమీ దొరకలేదని బుకాయించే ప్రయత్నం  చేశారు. అయితే, నగల సంచి తీసుకెళ్తున్న సీసీటీవీ ఫుటేజీ తమ వద్ద ఉందని చెప్పడంతో నిజం ఒప్పుకోక తప్పలేదు. దొరికిన బంగారంలో తమకు కొంతైనా ఇవ్వాలని కార్మికులు బతిమాలారు. అయితే, అవి గిల్టు నగలని చెప్పడంతో ఆశ్చర్యపోయారు.

పోలీసులు చెప్పినట్టు అవి నిజంగా గిల్టు నగలే. ఆ వివరాల్లోకి వెళితే, చిత్తూరు జిల్లా యాదమరి మండల పరిధిలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో మోర్థానపల్లి వద్ద ఉన్న ఆంధ్రాబ్యాంక్‌లో బ్యాంకు అప్రైజర్ రమేశ్ ఈ గిల్టు నగలను బ్యాంకులో ఉంచి గతంలో రుణం తీసుకున్నాడు. ఇదిలావుంచితే, గత సోమవారం బ్యాంకు నుంచి 3.45 కోట్ల విలువైన 17 కిలోల బంగారు ఆభరణాలు, 2.66 లక్షల రూపాయల నగదు, అప్రైజర్‌ రమేశ్ తనఖా పెట్టిన నగలు సహా చోరీకి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించిన పోలీసులు.. చోరీలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు.

అందులో భాగంగా తొలుత బ్యాంక్‌ మేనేజర్‌ పురుషోత్తం, క్యాషియర్ నారాయణ, వారి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు. సీసీటీవీ కెమెరాలు, కాల్ ‌రికార్డులను పరిశీలించిన అనంతరం అప్రైజర్‌ రమేశ్ పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు తేల్చారు. ముగ్గురూ పథకం ప్రకారం బ్యాంకు ఆభరణాలు చోరీ చేసి వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టారు. అందులో భాగంగా రమేశ్ తనఖా పెట్టిన గిల్టు నగలను మురుగుకాల్వలో పడేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించగా అవి పారిశుద్ధ్య కార్మికులకు దొరికినట్టు కనిపించడంతో, తాజాగా వాటిని స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News