ధోనీ రిటైరయ్యాడా... మా ఆయనే ఎందుకు రిటైరవ్వాలి?: విమర్శకులను ప్రశ్నించిన పాక్ క్రికెటర్ సర్ఫరాజ్ అర్ధాంగి

21-10-2019 Mon 20:34
  • కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కోల్పోయిన సర్ఫరాజ్
  • రిటైరవ్వాలన్న విమర్శకులు
  • ఘాటుగా స్పందించిన సర్ఫరాజ్ భార్య కుష్ బహత్

పాకిస్థాన్ క్రికెట్ లో సుదీర్ఘకాలం జట్టుకు నాయకత్వం వహించిన వికెట్ కీపర్ సర్ఫరాజ్ పై ఇటీవలే వేటు పడింది. కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కూడా పోయింది. ఈ నేపథ్యంలో, సర్ఫరాజ్ ఇక ఆటకు వీడ్కోలు పలికితే మేలని విమర్శకులు సలహా ఇస్తున్నారు. అయితే సర్ఫరాజ్ భార్య కుష్ బహత్ మాత్రం మా ఆయన ఎందుకు రిటైరవ్వాలని ప్రశ్నిస్తోంది. అంతేకాదు, సర్ఫరాజ్ కు టీమిండియా వికెట్ కీపింగ్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీతో పోలిక తీసుకువచ్చింది.

"ధోనీ మా ఆయన కంటే ఎంతో పెద్దవయస్కుడు. మావారి వయసు 32 ఏళ్లే! ధోనీ వయసెంత? మరి ధోనీ రిటైరయ్యాడా? మా ఆయనే ఎందుకు రిటైరవ్వాలి?" అంటూ విమర్శకులను నిలదీసింది. అంతేకాదు, సర్ఫరాజ్ ఓ పోరాట యోధుడని, తప్పకుండా జట్టులోకి పునరాగమనం చేస్తాడని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇటీవలే సర్ఫరాజ్ ను కెప్టెన్సీ నుంచి తప్పించిన పీసీబీ, పరిమిత ఓవర్ల జట్టుకు, టెస్టు జట్టుకు వేర్వేరుగా కెప్టెన్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.