'మా' తరఫున ఎలాంటి సభలు జరిగినా అధ్యక్ష స్థానంలో నేనే ఉండాలి: నరేశ్ స్పష్టీకరణ

21-10-2019 Mon 19:51
  • నిన్న హైదరాబాద్ లో 'మా' స్నేహపూర్వక సమావేశం
  • రసాభాసగా ముగిసిన సమావేశం!
  • స్పందించిన 'మా' అధ్యక్షుడు నరేశ్

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో 'మా' అధ్యక్షుడు నరేశ్ స్పందించారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన 'మా' సభ్యుల స్నేహపూర్వక సమావేశం రసాభాస కావడంపై నరేశ్ మాట్లాడుతూ, 'మా' తరఫున ఎలాంటి సభలు జరిగినా అధ్యక్ష స్థానంలో తానే ఉండాలని స్పష్టం చేశారు. 'మా'లో ఏడాదికి ఒకసారి జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని, 25 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ చూడలేదని అన్నారు.

సమావేశానికి హాజరు కావాలంటూ 25 రోజుల క్రితం తనకు ఓ లేఖ వచ్చిందని వెల్లడించారు. అధ్యక్షుడిగా జనరల్ బాడీ సమావేశానికి సభ్యులను ఆహ్వానించాల్సింది తానేనని, కానీ తనను మరెవరో పిలవడం ఏంటని ఆ సమయంలో ఆశ్చర్యపోయానని నరేశ్ వివరించారు. తాను అధ్యక్షుడ్నైన ఆరు నెలల్లో ఒకసారి సమావేశం నిర్వహించానని, మూడు ఎగ్జిక్యూటివ్ సమావేశాలు కూడా నిర్వహించానని చెప్పారు. కానీ ఇప్పుడు జరిగిన మీటింగ్ పై అనుమానాలు ఉండడంతో హాజరు కాలేదని తెలిపారు.