దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే శక్తి సినిమాకు ఉందని ప్రధానితో చెప్పాం: దిల్ రాజు

21-10-2019 Mon 18:05
  • ప్రధాని నివాసంలో  చేంజ్ విత్ ఇన్ కార్యక్రమం
  • హాజరైన దిల్ రాజు
  • సినీ రంగం గురించి ప్రధానితో చర్చ

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన నివాసంలో 'చేంజ్ విత్ ఇన్' పేరిట సినీ తారలకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా ఉత్తరాది సినీ ప్రముఖులే కనిపించడంతో విమర్శలు వస్తున్నాయి. అయితే 'చేంజ్ విత్ ఇన్' కార్యక్రమానికి టాలీవుడ్ సినీ నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధినేత దిల్ రాజు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీని కలవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని 'చేంజ్ విత్ ఇన్' కార్యక్రమం నిర్వహించారని, ఈ సందర్భంగా సినిమా రంగం గురించి చర్చించామని దిల్ రాజు వెల్లడించారు. దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే శక్తి సినిమా రంగానికి ఉందన్న విషయాన్ని ప్రధానికి వివరించామని పేర్కొన్నారు.