Andhra Pradesh: రక్తమోడిన ఏపీ, తెలంగాణ రోడ్లు.. ఆరుగురి దుర్మరణం.. పలువురికి తీవ్ర గాయాలు

  • కడపలో కారును ఢీకొన్న లారీ
  • సిద్దిపేటలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
  • విజయవాడలో బోల్తాపడిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు

ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. కడప జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. చెన్నై నుంచి కడప జిల్లాలోని నందలూరుకు వెళ్తున్న కారును ఓబులవారిపల్లె మండలం రెడ్డిపల్లె చెరువు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నీలపల్లికి చెందిన మణెమ్మ, సాయికిరణ్, డ్రైవర్ పవన్ కల్యాణ్ ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికి తీశారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డు పడవల జంక్షన్ వద్ద జరిగిన మరో ఘటనలో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులున్నారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.  

తెలంగాణలోని సిద్దిపేటలో జరిగిన ఇంకో ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో అందులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను మానకొండూరు మండలం వేగురుపల్లికి చెందిన మల్లేశం, ప్రభాకర్‌ రెడ్డి, జనార్దన్‌రెడ్డిలుగా గుర్తించారు.  

More Telugu News