Devineni Uma: మీరు కనీసం బోటు తీయలేకపోయారు, మేం 300 అడుగుల కొండను తొలిచి డయాఫ్రమ్ వాల్ నిర్మించాం: దేవినేని ఉమ

  • జగన్ పై ఉమ విమర్శల పర్వం
  • బోటు తీయలేకపోయారంటూ వ్యాఖ్యలు
  • ఇది దద్దమ్మ ప్రభుత్వం అంటూ ఎద్దేవా

గోదావరిలో మునిగిపోయిన బోటును ఇంతవరకు తీయలేకపోయారంటూ సీఎం జగన్ ను మాజీ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. బోటు ప్రమాదం జరిగి నెల రోజులు దాటుతున్నా బయటికి తీయలేకపోయారని విమర్శించారు.

"జగన్ మోహన్ రెడ్డి గారూ, ప్రజలు మాట్లాడుతున్నారు. బోటు మునిగి నెలా ఐదు రోజులైంది, రాష్ట్రం మునిగి నాలుగున్నర నెలలైందని  అనుకుంటున్నారు. ఇది నా మాట కాదు జగన్ మోహన్ రెడ్డిగారూ, జనం మాట. నదిలో మునిగిన బోటును తీయలేకపోవడం మీ అసమర్థత కాదా, మీ చేతకానితనం కాదా, మరీ ఇంత దౌర్భాగ్యస్థితిలో ఉన్నారా? మా హయాంలో గోదావరి నదిలో ఉన్న 300 అడుగుల కొండలో 5 అడుగుల మేర తొలిచి కిలోమీటరు వరకు ప్లాస్టిక్ కాంక్రీట్ తో డయాఫ్రమ్ వాల్ నిర్మించాం జగన్ మోహన్ రెడ్డిగారూ!

ఇవాళ మీ దద్దమ్మ ప్రభుత్వం 30 రోజుల క్రితం బోటు 300 అడుగుల లోతున ఉందన్నారు. ఇప్పుడు 5 రోజుల నుంచి 50 అడుగుల లోతులో ఉందంటున్నారు. మరి మీరు లంగర్లు వేస్తున్నారో, ఇంకేం వేస్తున్నారో తెలియడంలేదు కానీ ఇంతవరకు బోటు బయటికి రాలేదు. గల్లంతైన వారి మృతదేహాల కోసం వారి కుటుంబ సభ్యులు చేస్తున్న రోదనలు ఈ ప్రభుత్వానికి వినపడడంలేదు, కనపడడంలేదు. ఇవాళ సీఎం ఎక్కడున్నాడంటే ఢిల్లీ వెళుతున్నాడన్న సమాధానం వినిపిస్తోంది. సీబీఐ కేసులు తప్పించుకునేందుకు జగన్ ఢిల్లీ వెళుతున్నారు" అంటూ విమర్శలు జడివాన కురిపించారు.

More Telugu News