Ranchi: మళ్లీ అదే కథ... రాంచీ టెస్టులో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్, కష్టాల్లో సఫారీలు

  • రోహిత్ శర్మ డబుల్, రహానే సెంచరీ
  • తొలి ఇన్నింగ్స్ 497/9 వద్ద డిక్లేర్ చేసిన భారత్
  • 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సఫారీలు
  • వెలుతురు లేమి కారణంగా నిలిచిపోయిన మ్యాచ్

భారత్ తో టెస్టు సిరీస్ దక్షిణాఫ్రికా జట్టుకు అత్యంత కఠినంగా పరిణమించింది. టాస్ మొదలుకుని ఏదీ కలిసిరావడంలేదు. రాంచీ టెస్టులోనూ టాస్ ఓడిన సఫారీలకు రోహిత్ శర్మ, రహానే తమ బ్యాటింగ్ పదును రుచి చూపించగా, ఆపై భారత బౌలర్లు తమ దూకుడు ప్రదర్శించారు. రెండో రోజు ఆటలో రోహిత్ శర్మ (212) డబుల్ సెంచరీ హైలెట్ కాగా, రహానే (115) సెంచరీతో అలరించాడు. ఆ తర్వాత టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ ను 497/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసి దక్షిణాఫ్రికా జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది.

టీమిండియా పేసర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ నిప్పులు చెరగడంతో సఫారీలు 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయారు. ఎల్గార్ (0) డకౌట్ కాగా, డికాక్ 4 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జుబేర్ హంజా, కెప్టెన్ డుప్లెసిస్ ఆడుతున్నారు. మూడు టెస్టుల ఈ సిరీస్ లో సఫారీలు ఇప్పటికే రెండు టెస్టుల్లోనూ ఓటమిపాలయ్యారు. పరిస్థితి చూస్తుంటే రాంచీలోనూ ఓటమి తప్పేట్టు కనిపించడంలేదు. అయితే, వెలుతురు లేమి కారణంగా రాంచీలో మ్యాచ్ నిలిచిపోయింది.

More Telugu News