‘మా’లో తార స్థాయికి చేరిన వివాదం.. కాసేపట్లో జరిగే సమావేశంపై ఉత్కంఠ

20-10-2019 Sun 12:28
  • నరేశ్‌, రాజశేఖర్‌ మధ్య విభేదాలు 
  • నరేశ్ లేకుండా సమావేశం
  • స్నేహపూర్వక సమావేశమే అంటున్న జీవితా రాజశేఖర్

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు నరేశ్‌, ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌ మధ్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరినట్లు సమాచారం. వారిద్దరి మధ్య వివాదం ఉందన్న విషయాన్ని మా ఇప్పటికే ఖండించినప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న పరిణామాలు చూస్తుంటే విభేదాలు మరింత పెరిగినట్లు అర్థమవుతోంది. మా సభ్యుల సమావేశం ఉందని జీవితారాజశేఖర్‌ మెసేజ్ పంపడంతో నరేశ్‌ కార్యవర్గం విస్మయానికి గురయ్యారు. అయితే, ఈ రోజు జరిగేది జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదని కేవలం స్నేహపూర్వక సమావేశం మాత్రమేనని జీవితారాజశేఖర్ అంటున్నారు.

అధ్యక్షుడు నరేశ్ లేకుండా ఈ సమావేశం ఎలా నిర్వహిస్తారని నరేశ్‌ తరఫు న్యాయవాది నిలదీస్తున్నారు. మరికాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. నరేశ్‌కు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని రాజశేఖర్‌ కార్యవర్గం యోచించినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఉత్కంఠ నెలకొంది. ఇది స్నేహపూర్వక సమావేశమేనని మా ముఖ్య సలహాదారు కృష్ణంరాజు కూడా అంటున్నారు. ఈ సమవేశానికి వచ్చిన వారితో ఎలాంటి సంతకాలు పెట్టించబోమని తెలిపారు.