Karnataka: ఇంకోసారి దురుసుగా మాట్లాడబోనన్న బీజేపీ ఎమ్మెల్యే!

  • కేంద్ర మంత్రులను టార్గెట్ చేసిన యత్నాళ్
  • క్రమశిక్షణా సంఘం నోటీసులు
  • బాధితులను చూసి ఆవేదనతోనే మాట్లాడానని వివరణ

తన వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలను కొని తెచ్చుకున్న బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్, మరోసారి అలా మాట్లాడబోనని హామీ ఇచ్చారు. ఇటీవలి వర్షాలకు ఉత్తర కర్ణాటకలో భారీ వరదలు రాగా, లక్షల మంది రోడ్డున పడ్డారని, వారిని చూసిన బాధతోనే కేంద్రమంత్రులు, ఎంపీలను టార్గెట్ చేసి మాట్లాడానని ఆయన వివరణ ఇచ్చారు. ఇంకోసారి దురుసుగా మాట్లాడబోనని అన్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలకు వ్యతిరేకంగా యత్నాళ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపగా, పార్టీ జాతీయ కమిటీ క్రమశిక్షణా విభాగం నోటీసులు జారీ చేసింది.

దీనిపై స్పందించిన యత్నాళ్, క్రమశిక్షణా విభాగానికి లేఖను పంపుతూ, వరద బాధితులకు సాయం అందలేదన్న ఆవేదనతోనే అలా మాట్లాడానని, తనలో ఏ దురుద్దేశమూ లేదని చెప్పారు. పార్టీలో తాను క్రమశిక్షణ గల సైనికుడి వంటివాడినని, తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టివుంటే క్షమించాలని లేఖలో రాశారు. ప్రధాని, పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రులను హేళన చేయాలన్న ఆలోచన తనకు ఎన్నడూ లేదని చెప్పారు.

More Telugu News