వైన్స్ పై ప్లెక్సీ ద్వారా ప్రజల వినూత్న వినతి!

20-10-2019 Sun 07:05
  • వరంగల్ జిల్లా భీమారంలో వెలిసిన ప్లెక్సీ
  • బస్టాండ్ ఎదుట షాపు వద్దని వినతి
  • వేరే ప్రాంతానికి మార్చాలంటున్న ప్రజలు

నిన్నటి వరకూ అక్కడ వైన్స్ షాప్ ఉండేది. ఇప్పుడు కూడా అక్కడే ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రజలు, మహిళలు, విద్యార్థుల నుంచి వినూత్న వినతి వచ్చింది. బస్టాండ్ కు ఎదురుగా వైన్స్ షాపు పెట్టవద్దని ఆ గ్రామస్థులు ఓ ప్లెక్సీని తయారు చేసి ప్రదర్శిస్తున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లా భీమారంలో జరిగింది. ఇక్కడ బస్టాండ్ ఎదురుగా ఓ వైన్స్ షాపుండగా, ఇటీవల తాజా లైసెన్స్ లు ఖరారయ్యాయి.

ఈ నేపథ్యంలో బస్టాండ్ ఎదురుగా షాపును పెట్టవద్దంటూ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ బాలస్వామికి వినతిపత్రం కూడా అందజేసిన ప్రజలు, ఆ ప్రాంతంలో షాపు ఏర్పాటుకు గదులు ఇవ్వవద్దని భవన యజమానులను కూడా కోరారు. ఇక్కడే విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు ఉన్నాయని, వైన్‌ షాపు కారణంగా విద్యార్థులకు, మహిళలకు ఇబ్బంది కలుగుతోందని, ట్రాఫిక్‌ కు అంతరాయం ఏర్పడుతోందని వారు వాపోయారు. మద్యం షాపును వేరే చోటుకు మార్చుకోవాలని అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.