Sourav Ganguly: దాదాకు ఆ పది నెలలు సరిపోవు: మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్

  • దాదాకు మరింత సమయం ఇవ్వాలన్న గంభీర్
  • తోడ్పాటు దొరికితేనే  పూర్తి స్థాయిలో ఫలితాలు రాబడతారని వెల్లడి
  • ఇకపై అందరూ భారత క్రికెట్ నే గమనిస్తారని వ్యాఖ్యలు

బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న సౌరవ్ గంగూలీకి భారత క్రికెట్ అభివృద్ధిలో పాలుపంచుకోవడానికి, బోర్డులో మార్పులు తీసుకురావడానికి పదినెలల కంటే ఎక్కువ సమయం ఇస్తే మంచిదని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. అక్టోబర్ 23న గంగూలీ బీసీసీఐ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గంభీర్ దాదాకు శుభాకాంక్షలు తెలియచేశాడు.

"అందరూ దాదాకు మద్దతు ఇస్తారని అనుకుంటున్నా.  భారత క్రికెట్ లోని అన్ని వర్గాల తోడ్పాటు దొరికితేనే ఆయన పూర్తి స్థాయిలో ఫలితాలు రాబడతారు. అప్పట్లో జగ్మోహన్ దాల్మియా సహకారంతోనే గంగూలీ సవాళ్లను అధిగమించారు. కోచ్ జాన్ రైట్ తో కలిసి దాదా సెహ్వాగ్, యువరాజ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, నెహ్రా వంటి యువ ఆటగాళ్లను స్టార్ ఆటగాళ్లుగా మలిచారు.

బీసీసీఐ పెద్దల తోడ్పాటు దాదాకు అవసరం. ఇప్పటినుంచి భారత క్రికెట్ ను ప్రపంచం ఆసక్తితో గమనిస్తుంది. భారత  క్రికెట్ వ్యవస్థపై అవగాహన ఉన్న వ్యక్తి క్రికెట్ బోర్డు అధినేత కావడం అదృష్టం. అధ్యక్షుడిగా దాదా తనదైన ముద్రతో పాలన చేయడానికి పది నెలల సమయం సరిపోదు. ఇంకా  ఎక్కువ సమయం లభించాలని నేను అనుకుంటున్నాను. అలా కాకుంటే మొత్తం కసరత్తు వ్యర్థమే" అని గంభీర్ పేర్కొన్నాడు.

More Telugu News