Jagadish Reddy: ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అరాచకాలను ప్రజలు మరిచిపోలేదు: మంత్రి జగదీశ్ రెడ్డి

  • ఇద్దరూ దొంగలేనని వ్యాఖ్యలు
  • అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అంటూ ఉత్తమ్ కు సవాల్
  • ప్రజలకు ఎవరికి ఓటు వేయాలో తెలుసంటూ కామెంట్

కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిల అరాచకాలను ప్రజలు మరిచిపోలేదని.. వారికి తగిన గుణపాఠం చెపుతారని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. వీరిద్దరు తోడు దొంగలు అని మంత్రి పేర్కొన్నారు. వీరిద్దరు కలిసి హుజూర్ నగర్ నియోజకవర్గంపై పడ్డారన్నారు. అయితే, ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసని అన్నారు.

రేవంత్ రూ.50 లక్షలతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని, ఉత్తమ్ రూ.3 కోట్లను కారులో కాల్చివేశారని విమర్శించారు. సూర్యాపేట అభివృద్ధిపై  చర్చకు సిద్ధమా అంటూ ఉత్తమ్ కు జగదీశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. అందుకు వేదికగా హుజూర్ నగర్  లేదా సూర్యపేట ఏదైనా సరే... నిర్ణయించి తెలిపితే.. తాను వస్తానని మంత్రి అన్నారు. ఇరవై ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి చేసింది ఏమిటని ఉత్తమ్ ను సూటిగా ప్రశ్నించారు.

నేను ఐదేళ్లు  శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారు. పద్మావతికి టికెట్ ఇవ్వొద్దని ఉత్తమ్ ను కోరిన రేవంత్ నే మళ్లీ ప్రచారానికి దింపి ఉత్తమ్ తన బలహీన మనస్తత్వాన్ని బహిర్గతం చేసుకున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.

More Telugu News