ESI: జైల్లో ఆత్మహత్యకు యత్నించిన ఈఎస్ఐ స్కాం నిందితురాలు పద్మ

  • చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పద్మ
  • ఈఎస్ఐలో జాయింట్ డైరెక్టర్ గా ఉద్యోగం
  • చికిత్స కోసం ఇచ్చిన మాత్రలను ఒక్కసారిగా మింగిన వైనం

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాం నిందితుల్లో ఒకరైన పద్మ జైల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పద్మ ఈఎస్ఐలో జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. ఈఎస్ఐ స్కాంలో ఆమె పాత్ర కూడా ఉన్నట్టు అనుమానించిన ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, జరుగుతున్న పరిణామాల పట్ల మనస్తాపం చెంది చికిత్స కోసం ఇచ్చిన మాత్రలను ఒక్కసారే ఎక్కువ సంఖ్యలో మింగేశారు. దాంతో జైలు సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

అత్యవసర చికిత్స విభాగంలో పద్మకు చికిత్స అందించిన వైద్యులు ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. నకిలీ బిల్లులు సృష్టించి మందుల కొనుగోళ్లు జరిపి కోట్లు వెనకేసుకున్నట్టు ఈఎస్ఐలో ఉన్నతస్థాయి అధికారులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ కుంభకోణం విచారణ దశలో ఉంది.

More Telugu News