రేవంత్, కోమటిరెడ్డి రోడ్డునపడి కొట్టుకోవడం ఖాయం: పల్లా రాజేశ్వర్ రెడ్డి

19-10-2019 Sat 17:47
  • ఉపఎన్నిక తర్వాత ఉత్తమ్ పదవి ఊడుతుంది
  • ఆ పదవి కోసం రేవంత్, కోమటిరెడ్డి ఫైట్ తప్పదు
  • నాపై ఆరోపణలు చేసిన ఉత్తమ్ క్షమాపణలు చెప్పాలి

కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి లపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజూర్ నగర్ ఉపఎన్నిక తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పిస్తారని, ఆ పదవి కోసం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రోడ్డునపడి కొట్టుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు.

హుజూర్ నగర్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హుజూర్ నగర్ లో కాంగ్రెస్ కు ఓటమి తప్పదని భావించిన ఉత్తమ్, తమ పార్టీ నేతలందరినీ ఇక్కడకు రప్పించి ప్రచారం చేశారని, తనపై లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఈ ఆరోపణలను రుజువు చేయనిపక్షంలో, ఉత్తమ్ బేషరతుగా క్షమాపణలు చెప్పి ముక్కునేలకు రాయాలని డిమాండ్ చేశారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డికి ఘోర పరాజయం తప్పదని, తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.