laxman: కార్మికుల ఉద్యమంలో పాల్గొనని ఈటల, హరీశ్ రావు ద్రోహులే!: లక్ష్మణ్

  • బీజేపీ నేతలు లక్ష్మణ్, రామచందర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి అరెస్ట్
  • అప్రజాస్వామిక చర్యలను తాను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తున్నానన్న లక్ష్మణ్ 
  • ఇది నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న ఉద్యమమని వ్యాఖ్య

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఇచ్చిన బంద్ కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కార్మికులతో కలిసి ప్రతిపక్ష పార్టీల నేతలు బంద్ లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లోని అబిడ్స్ లో ఆందోళనలో పాల్గొన్న బీజేపీ నేతలు లక్ష్మణ్, రామచందర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... పదవులు శాశ్వతం కాదన్న విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ప్రస్తుతం జరుగుతున్న సమ్మె కేవలం ఆర్టీసి కార్మికులది కాదని.. ఇది సకల జనుల సమ్మె అని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు ద్రోహులంటూ గతంలో టీఆర్ఎస్ నేతలు అన్నారని లక్ష్మణ్ గుర్తు చేశారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల ఉద్యమంలో పాల్గొనని రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావులు కూడా ద్రోహులేనని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అప్రజాస్వామిక చర్యలను తాను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తున్నానని లక్ష్మణ్ తెలిపారు. కోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ రాష్ట్ర సర్కారు స్పందించట్లేదని తెలిపారు. కార్మికులది నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న ఉద్యమమని తెలిపారు.

More Telugu News