accident: మృత్యుంజయురాలు...వరుసగా రెండు ప్రమాదాలు.. అయినా బతికి బట్టకట్టింది

  • పొలంలో పనిచేస్తుండగా పిడుగుపాటు
  • గాయాలతో బయటపడడంతో ఆసుపత్రిపాలు
  • హాస్పటల్‌లో ఆమెపై ఊడిపడిన శ్లాబ్‌ పెచ్చులు

మృత్యువు వెన్నంటే నడిచినా ఆమెది గట్టి ప్రాణం. పిడుగు పాటుకు గురై తప్పించుకుని ఆసుపత్రిలో చేరితే అక్కడ శ్లాబ్‌ పెచ్చులు ఊడి మీద పడ్డాయి. వరుసగా రెండుసార్లు మృత్యు ముఖంలోకి వెళ్లినా బతికి బట్టకట్టింది.

వివరాల్లోకి వెళితే...నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కుమ్మరకొండూరుకు చెందిన పోలమ్మ మేకలు మేపుకొంటూ జీవనోపాధి పొందుతోంది. రెండు రోజుల క్రితం మేకల్ని మేపేందుకు ఊరిబయటకు తీసుకువెళ్లింది. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమయ్యింది. కాసేపటికి ఆమెకు సమీపంలోనే పిడుగు పడడంతో తీవ్రంగా గాయపడింది.

ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమెను సమీపంలో ఉన్నవారు గుర్తించి కావలిలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతోంది. కాగా, నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆమె చికిత్స పొందుతున్న వార్డు శ్లాబ్‌ నుంచి పెచ్చులూడి ఆమె మంచంపై పడ్డాయి. అదే సమయంలో ఆమె మంచంపై నుంచి లేవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది.

ఘటన జరిగిన కాసేపటి ముందు వరకు తాను మంచంపై నిద్రలో ఉన్నానని, అప్పుడే తెలివి రావడంతో మంచంపై నుంచి లేవడం వల్ల ప్రాణాలు దక్కాయని పోలమ్మ తెలిపింది. ఘటనానంతరం ఆసుపత్రి సిబ్బంది పోలమ్మను మరో వార్డుకు తరలించి, మంచంపై పడిన పెచ్చులు తొలగించారు.

More Telugu News