Ayodhya: లీకైన మధ్యవర్తిత్వ ప్యానెల్ నివేదికను తిరస్కరించిన ముస్లిం పిటిషనర్లు!

  •  మధ్యవర్తిత్వ ప్యానెల్ పరిష్కార మార్గాన్ని మేము అంగీకరించలేదు
  • నివేదికను మధ్యవర్తిత్వ ప్యానెల్ లేదా నిర్వాని అఖాడా లీక్ చేసింది
  • నివేదిక విన్-విన్ (ఉభయలుకు మేలు కలిగించే విధంగా) ఉంది: వక్ఫ్ బోర్డు న్యాయవాది

తమ షరతులకు అంగీకరిస్తే కనుక అయోధ్య వివాదాస్పద భూమిపై తమ హక్కును వదులుకోవడానికి తాము సిద్ధమంటూ పిటిషనర్ సున్నీ ఫక్ఫ్ బోర్డు మధ్యవర్తిత్వ ప్యానెల్ కు తెలిపినట్టు వార్తలొచ్చిన సంగతి విదితమే. అయితే, వీరికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు న్యాయమూర్తుల బృందం నేడు ఓ ప్రకటన చేస్తూ, అటువంటి ఒప్పందానికి తాము అంగీకరించలేదని స్పష్టం చేశారు. ఈ మధ్యవర్తిత్వ ప్యానెల్ అటు ముస్లిం, హిందు వర్గాలను సంప్రదించి విన్-విన్( ఉభయలుకు మేలు కలిగించే విధంగా)  నివేదిక ఇచ్చిందని వక్ఫ్ బోర్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న షాహిద్ రిజ్వి పేర్కొనడం గమనార్హం.
 
ఆయోధ్యలోని మందిరం-మసీదు కేసులో బుధవారం నాటికి వాదనలు ముగిశాయి. అదేరోజు మధ్యవర్తిత్వ ప్యానెల్ తమ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎఫ్ ఎం కలీఫు్ల్లా, ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పాంచులతో కూడిన మధ్యవర్తిత్వ ప్యానెల్  మార్చిలోనే పలు గ్రూపులను సంప్రదించడం ప్రారంభించి తుది నివేదికను తయారు చేశాయి.

ఈ నివేదిక లీక్ అయినట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో ముస్లిం పిటిషనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులు ఒక ప్రకటన చేస్తూ... లీకైన నివేదికలో పేర్కొన్నట్టు వివాదాస్పద మందిరం - మసీదు స్థలంలో రామ మందిరం నిర్మాణం కొనసాగించడానికి వక్ఫ్ బోర్డు ఒప్పుకున్నట్లు ఉందనటం తప్పు అని స్పష్టం చేశారు. ఈ మేరకు న్యాయవాది ఎజాజ్ మక్బూల్ వక్ఫ్ బోర్డు పేరును ప్రస్తావించకుండా..‘ ముస్లిం పార్టీలు, వర్గాలు, మధ్యవర్తిత్వ ప్యానెల్ సూచించిన సెటిల్ మెంట్ ప్రణాళికను తిరస్కరించాయి’ అని చెప్పారు. ఈ నివేదికను మధ్యవర్తిత్వ కమిటీ లేదా నిర్వాని అఖాడా (వివాదాస్పద స్థలంలో ఉన్న మసీదు లేదా ప్రాంతం తమదేనని వాదిస్తున్న ఓ సంస్థ) లీక్ చేసివుంటుందని ఎజాజ్ మక్బూల్ అనుమానం వ్యక్తం చేశారు.

More Telugu News