Madhu Yaskhi Goud: ఆర్టీసీ కార్మికుల ఉసురు కేసీఆర్ కుటుంబానికి తగులుతుంది: మధుయాష్కీగౌడ్

  • ఆర్టీసీ కార్మికుల సమ్మె 50 వేల మంది ఉద్యోగులది కాదు
  • 5 కోట్ల మంది ప్రజలు వారి వెనుక ఉన్నారు
  • ఆర్టీసీ ఆస్తులు కుటుంబ సభ్యులకు కట్టబెట్టాలని కేసీఆర్ చూస్తున్నారు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విజయవంతమవుతుందని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. సమ్మె 50 వేల మంది ఉద్యోగులది కాదని.. ఇది ఐదు కోట్ల మంది ప్రజల సమస్య అని పేర్కొన్నారు. మధుయాష్కీ గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా విమర్శించారు.

‘కేసీఆర్ విధానాలు కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నాయి. ఆర్టీసీలో నష్టాలంటూ కట్టు కథ చెబుతున్నారు. సంస్థ ఆస్తులను కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్మికుల శాపం కేసీఆర్ కుటుంబానికి తగులుతుంది. టీఎన్జీవో, టీజీవోలు ఎంగిలి మెతుకులకు ఆశపడవద్దు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులకు ఆశపడి కార్మికులను మోసం చేయవద్దు. ఆలస్యంగానైనా వారు మేల్కొని... ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతున్నారు. మలిదశ ఉద్యమానికి ప్రజలంతా సిద్ధం కావాలి. రేపటి బంద్ ను ప్రజలు విజయవంతం చేయాలి’ అని అన్నారు.

తెలంగాణ సంపదలో ఆర్టీసీ కార్మికులు కూడా భాగస్వాములేనని యాష్కీ చెప్పారు. పొరుగు రాష్ట్రంలో కార్మికులు ఉద్యోగులుగా మారితే.. మన రాష్ట్రంలో కార్మికులు ఉద్యోగాలు పోగొట్టుకోవడం దారుణమన్నారు. ‘కార్మికులారా మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు. ఆందోళన పడకండి. మీ వెనుక మేము ఉన్నాము. నక్సలిజం పేరుతో కేసులు పెట్టి వేధించడం తగదు. తెలంగాణ ఆస్తులు దోచుకోవడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకమయ్యారు. తెలంగాణను వ్యతిరేకించిన జగన్ తో మీరు ఎలా కలిసి పనిచేస్తారు?’ అని మధుయాష్కీ ప్రశ్నించారు. ఏపీలో ఏబీఎన్ ప్రసారాల నిలిపివేతపై వ్యాఖ్యానిస్తూ.. ఇది జగన్ కక్ష సాధింపు చర్యగా పేర్కొంటూ.. ఇలాంటివి మానుకోవాలని సూచించారు.

More Telugu News