Jagan: జగన్ కంటే వైయస్ రాజశేఖరరెడ్డి బెటర్: చంద్రబాబు

  • పత్రికా స్వేచ్ఛను హరించేలా అప్పట్లో వైయస్ జీవో తీసుకొచ్చారు
  • నిరసన వ్యక్తమయ్యేసరికి జీవోను రద్దు చేశారు
  • ఇప్పుడు అదే జీవోను జగన్ మళ్లీ బయటకు తీశారు

2007లో పత్రికా స్వేచ్ఛను హరించేలా అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఓ జీవో తీసుకొచ్చారని... ఆ జీవోకు వ్యతిరేకంగా అన్ని పార్టీల నేతలు, మీడియా ప్రతినిధులు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. పత్రికా విలేకరులు అర్ధరాత్రి సెక్రటేరియట్ లో ధర్నాలు చేశారని... జాతీయ పత్రికల సంపాదకులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారని తెలిపారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో తాను పోరాడానని చెప్పారు. దీంతో రాజశేఖరరెడ్డి వెనకడుగు వేశారని... మూడునాలుగు నెలల్లో తాను మీడియా వాచ్ అనే మీటింగే పెట్టలేదని... ఇది ఏవిధంగా జరిగిందో తనకు తెలియదని... తక్షణమే జీవోను రద్దు చేస్తున్నానని ప్రకటించారని తెలిపారు. తనకు ఎలాంటి దురుద్దేశాలు లేవని ఆయన చెప్పారని తెలిపారు.

మీ ప్రమేయం లేకుండా జీవో ఎలా వస్తుందో చెప్పమని తాము వైయస్ ను ప్రశ్నించామని చంద్రబాబు చెప్పారు. దీనికి సమాధానంగా విచారణ జరిపిస్తామని వైయస్ చెప్పారని తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే వైయస్ విజ్ఞతను మనం అభినందించాలని చెప్పారు. రాజకీయ నేతలు, మేధావులు అందరి స్పందన చూసిన తర్వాత జీవోను విత్ డ్రా చేశారని తెలిపారు.

ఇప్పుడు అదే జీవోను ప్రస్తుత సీఎం జగన్ కేబినెట్ మీటింగ్ లో పెట్టారని చంద్రబాబు విమర్శించారు. ఆ జీవోకు ఇంకొంచెం పదును పెట్టారని అన్నారు. జగన్ ఆ జీవోను మాత్రమే చూశారని... ఆ జీవోను ఆయన తండ్రి విత్ డ్రా చేసుకున్న విషయాన్ని చూడలేదని చెప్పారు. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని జగన్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. చేసిన తప్పును ఆరోజు రాజశేఖరెడ్డి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కరెక్ట్ చేసుకున్నారని... జగన్ మాత్రం అహంభావం, గర్వంతో ముందుకు పోతున్నారని విమర్శించారు. జగన్ కంటే వైయస్ చాలా బెటర్ అని కితాబిచ్చారు.

More Telugu News