Neha Chowksi: హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో లైంగిక వేధింపులు... నేహా అనే యువతి ఆత్మహత్యతో తీవ్ర కలకలం!

  • భోపాల్ నుంచి బదిలీపై వచ్చిన నేహా చౌక్సీ
  • ఉన్నతాధికారుల వేధింపులు
  • చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య

ప్రభుత్వ రంగ బీహెచ్ఈఎల్ (భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్)లో లైంగిక వేధింపులు తట్టుకోలేకున్నానంటూ నేహా చౌక్సీ అనే ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. మియాపూర్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, పశ్చిమ బెంగాల్ కు చెందిన నేహా చౌక్సీ తన కుటుంబీకులతో కలిసి హఫీజ్ పేట్ లో నివాసం ఉంటూ బీహెచ్ఈఎల్ లో అకౌంట్స్ విభాగంలో పని చేస్తోంది.

నిన్న ఉదయం 10.30 గంటల నుంచి ఆమె భర్త సునీల్ ఖండేల్వాల్, ఎంతగా ఫోన్ చేసినా తీయలేదు. ఆందోళనతో ఇంటికి వచ్చిన ఆయన, సెక్యూరిటీ సిబ్బంది సాయంతో డోర్ బద్దలు కొట్టి చూడగా, తన చున్నీతో ఆమె ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించింది.విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి వచ్చి సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. బీహెచ్ఈఎల్ లో ఉన్నతాధికారులు, సహచర ఉద్యోగులు తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారని సూసైడ్ నోట్ లో ఆమె రాసుకుంది. ఇదే విషయాన్ని ఆమె తనకు చెప్పేదని సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీజీఎం కిశోర్ కుమార్, జీఎంలుగా పని చేస్తున్న త్రితాబా సిస్వయిన్, మోహన్ లాల్ సోని, సుమలత, గోపారామ్, నితిన్, సీతారాం తదితరులు వేధించారని ఆరోపించారు.

కాగా, భోపాల్ బీహెచ్ఈఎల్ లో పనిచేస్తున్న నేహా చౌక్సీ, ఈ సంవత్సరం జూన్ 10న హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ మీద వచ్చింది. భోపాల్ లో ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే, ఆమె బదిలీ కోరుకుంది. ఇక్కడా అదే తరహా అనుభవాలు ఎదురు కావడంతో ఆమె తట్టుకోలేకపోయిందని భర్త సునీల్ ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ ప్రారంభించారు.

More Telugu News