సినిమాలో ఆ 'బ్రాండ్' చూపిస్తామని మోసం... 'సాహో' నిర్మాతలపై జౌట్ షైన్ ఇండియా ఫిర్యాదు!

18-10-2019 Fri 10:30
  • సినిమాలో బ్రాండ్ ప్రమోషన్
  • ఆర్క్ టిక్ ఫాక్స్ పేరు చూపేందుకు రూ. 37 లక్షలు
  • సినిమాలో పేరు చూపలేదని ఫిర్యాదు

ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'సాహో' నిర్మాతలైన యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై బెంగళూరుకు చెందిన జౌట్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఈ సినిమాలో తమ బ్రాండ్ అయిన ఆర్క్ టిక్ ఫాక్స్ పేరును చూపిస్తామని చెబుతూ, రూ. 37 లక్షలు తీసుకున్నారని, సినిమాలో తమ బ్రాండ్ ఎక్కడా కనిపించలేదని వారి ఫిర్యాదు. సంస్థ మార్కెటింగ్ హెడ్ విజయ్ రావు ఈ మేరకు పోలీసులను ఆశ్రయించారు.

సినిమా నిర్మాతలు వంశీ కృష్ణారెడ్డి, యూ ప్రమోద్, విక్రమ్ రెడ్డిలతో సెలబ్రిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈసీఓ డీ హిమాంద్ డీల్ కుదుర్చుకున్నారని, ఇందులో భాగంగా సినిమా మధ్యలో తమ బ్రాండ్ ను చూపించాల్సి వుందని విజయ్ రావు తన ఫిర్యాదులో తెలిపాడు. సినిమా బ్రాడ్ కాస్టింగ్ కోసం అదనంగా కోటి రూపాయలను ఇన్వెస్ట్ చేశామని తెలిపారు. సినిమా మధ్యలో తమ బ్రాండ్ ఎక్కడా చూపించలేదని ఆయన ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విచారణ ప్రారంభించారు. దీనిపై చిత్ర నిర్మాతలు స్పందించాల్సి వుంది.