చిన్ననాటి స్నేహితుడితో కలిసి ఏడడుగులు వేసిన వైసీపీ ఎంపీ మాధవి!

18-10-2019 Fri 10:12
  • అంగరంగ వైభవంగా మాధవి వివాహం
  • 22న రుషికొండ రిసార్టులో రిసెప్షన్
  • శివప్రసాద్ ఆమెకు చిన్ననాటి స్నేహితుడు 

26 సంవత్సరాల వయసులోనే పార్లమెంట్ లో అడుగుపెట్టి, దేశమంతటినీ ఆకర్షించిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నిన్న రాత్రి శరభన్నపాలెంలో మాధవి వివాహం, ఆమె చిన్ననాటి స్నేహితుడు శివప్రసాద్ తో జరిగింది. ఈ పెళ్లికి పలువురు రాజకీయ నాయకులు తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

శివప్రసాద్ స్వస్థలం విశాఖపట్టణం జిల్లా గొలుగొండ మండలం కెడిపేట గ్రామం కాగా, ఎంబీయే చదివిన ఆయన, ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాలేజీని నిర్వహిస్తున్నారు. గతంలో టీచర్‌ గా పనిచేసిన మాధవి, ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో అరకు లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్‌ పై దాదాపు 2 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు.

కాగా, వివాహానికి ముందు నూతన జంట తీసుకున్న ప్రీ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. పచ్చని చెట్లు, జలపాతాల మధ్య ఈ జంట దిగిన ఫోటోలు చూడముచ్చటగా కనిపించాయి. వీరిద్దరి మ్యారేజ్ రిసెప్షన్, ఈ నెల 22న రుషికొండలోని సాయిప్రియ బీచ్ రిసార్టులో జరుగనుంది.