సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

18-10-2019 Fri 07:31
  • మూడు భాషల్లో బిజీగా త్రిష 
  • రామ్ సరసన ఇద్దరు నాయికలు 
  • శ్రీకాంత్ చిన్నబ్బాయి అరంగేట్రం

*  గత పదిహేడేళ్లుగా తమిళ, తెలుగు భాషల్లో తిరుగులేని కథానాయికగా రాణిస్తున్న అందాలతార త్రిష ఇప్పుడు మూడు సినిమాలతో బిజీగా వుంది. తమిళంలో మణిరత్నం సినిమాలోను, మలయాళంలో జీతు జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ చిత్రంలోను నటిస్తోంది. ఇక తెలుగులో చిరంజీవితో కొరటాల శివ రూపొందిస్తున్న భారీ చిత్రంలో కూడా త్రిష నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
*  'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో హిట్ కొట్టిన యంగ్ హీరో రామ్ ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్నాడు. తమిళ చిత్రం 'థాడం'కి రీమేక్ గా రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్లుగా నివేదా పేతురాజ్, మాళవిక శర్మ ఎంపికయ్యారు.
*  ప్రముఖ నటుడు శ్రీకాంత్ పెద్దబ్బాయి రోషన్ ఆమధ్య 'నిర్మల కాన్వెంట్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సంగతి విదితమే. ఇప్పుడు శ్రీకాంత్ చిన్నబ్బాయి పదేళ్ల రోహన్ కూడా నటుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. ప్రభుదేవా నటిస్తున్న 'ఊమై విజిగళ్' అనే తమిళ చిత్రం ద్వారా బాల నటుడిగా పరిచయం అవుతున్నాడు.