Narendra Modi: కేంద్ర మంత్రివర్గంలో ఆ మూడు రాష్ట్రాల వారికి చోటు.. త్వరలో విస్తరణ!

  • రాజకీయ అవసరాల రీత్యా కేబినెట్ విస్తరణ
  • ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోని బీజేపీ నేతలకు మంత్రివర్గంలో చోటు
  • ప్రధాని మాజీ ముఖ్యకార్యదర్శి నృపేంద్రమిశ్రాకు గవర్నర్ పదవి?

రాజకీయ అవసరాల రీత్యా కేంద్ర మంత్రివర్గాన్ని స్వల్పంగా విస్తరించాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది బీహార్, జార్ఖండ్, ఢిల్లీ శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయ నాయకులకు కేంద్ర కేబినెట్‌లో స్థానం కల్పించేందుకు విస్తరణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. బీహార్‌లో బీజేపీ మిత్రపక్షమైన జేడీయూకి మంత్రివర్గంలో చోటు కల్పించాలని, అలా చేయకుండా ఎన్నికలకు వెళ్లడం సరికాదన్నది అధిష్ఠానం అభిప్రాయంగా తెలుస్తోంది.

మరోవైపు, ఈ నెల 31 నుంచి జమ్మూకశ్మీర్‌లు విడిపోనుండడంతో లడఖ్‌కు కొత్తగా లెఫ్టినెంట్ గవర్నర్‌‌ను నియమించాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. అలాగే, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీకి కూడా కొత్త గవర్నర్‌ను నియమించనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మాజీ ముఖ్య కార్యదర్శి నృపేంద్రమిశ్రాను ఈ రెండింటిలో ఏదో ఒకదానికి గవర్నర్‌గా నియమించవచ్చని సమాచారం. ఇక, అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మారే జమ్మూకశ్మీర్‌కు ప్రస్తుతం ఉన్న సత్యపాల్ మాలిక్‌నే గవర్నర్‌గా కొనసాగించనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

More Telugu News