TDSAT: ఆ ఛానళ్ల ప్రసారాలను తక్షణం పునరుద్ధరించాలి... ఏపీ ఫైబర్ నెట్ కు టీడీశాట్ ఆదేశం

  • రూ.32 లక్షలు జరిమానాగా చెల్లించాలన్న టీడీశాట్
  • లేకపోతే కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడి
  • కమిటీ సాయంతో ప్రసారాలు పునరుద్ధరిస్తామని స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్ లో టీవీ5, ఏబీఎన్ న్యూస్ ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై  టీడీశాట్ (టెలికాం వివాదాలు పరిష్కారానికి నెలకొల్పిన అప్పిలేట్ ట్రైబ్యునల్) ఏపీ ఫైబర్ నెట్ పై ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ ఆదేశాల ధిక్కరణను ట్రైబ్యునల్ తీవ్రంగా పరిగణిస్తూ.. గతంలో విధించిన జరిమానాతో పాటు మొత్తం రూ.32 లక్షలు టీడీశాట్ వద్ద జమ చేయాలంటూ పేర్కొంటూ తక్షణమే ప్రసారాలను పునరుద్ధరించాలని ఆదేశించింది.

 కాగా, తమ సంస్థ ఇప్పటికే కోట్ల రూపాయల నష్టాల్లో వుందని, జరిమానా చెల్లించటం కష్టమని ఫైబర్ నెట్, ట్రైబ్యునల్ కు తెలుపగా ట్రైబ్యునల్ ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆదేశాలను లెక్కచేయకపోతే కమిషనర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని పంపి ప్రసారాలు పునరుద్ధరించేలా చర్యలు చేపడతామని పేర్కొంది. కమిటీలో సభ్యులుగా స్థానిక కమిషనర్, ట్రైబ్యునల్ నిర్ణయించిన న్యాయవాదితో పాటు ఇరు పక్షాలు నిర్ణయించిన న్యాయవాదులు ఉంటారని టీడీశాట్ స్పష్టం చేసింది.

ఇటీవల రాష్ట్రంలో ఏబీఎన్, టీవీ5 ప్రసారాలను అనధికారికంగా నిషేధించడంతో, సదరు ఛానళ్ల యాజమాన్యాలు టీడీశాట్ ను ఆశ్రయించాయి. విచారణ జరిపిన అనంతరం ట్రైబ్యునల్ ఏపీ పైబర్ నెట్ పై జరిమానా విధిస్తూ ఈ నెల ఒకటిన తీర్పు చెప్పింది. అప్పటినుంచి నేటివరకు రోజుకు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.32 లక్షలు ట్రైబ్యునల్లో జమ చేయాలని ఆదేశించింది.

More Telugu News