Anil Kumble: నాటి సలహాకు ఇన్నేళ్ల తర్వాత కుంబ్లేకి సారీ చెప్పిన సెహ్వాగ్!

  • సెహ్వాగ్ సలహాతో అప్పట్లో సెంచరీ చేజార్చుకున్న కుంబ్లే
  • విచారం వ్యక్తం చేసిన సెహ్వాగ్
  • హుందాగా స్పందించిన కుంబ్లే

టీమిండియా చరిత్రలో అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరూ దిగ్గజాలే. లెగ్ స్పిన్ బౌలింగ్ లో అసమాన నైపుణ్యం ప్రదర్శించడమే కాదు, మైదానంలో పోరాటపటిమకు, క్రీడాస్ఫూర్తికి మారుపేరులా కుంబ్లే నిలిస్తే, సెహ్వాగ్ తన విధ్వంసక బ్యాటింగ్ తో బౌలర్లపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించాడు. వీరిద్దరూ భారత జట్టుకు ఎన్నో ఏళ్ల పాటు విశేషమైన సేవలు అందించారు. ఇవాళ కుంబ్లే జన్మదినం సందర్భంగా సెహ్వాగ్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. ఆ ట్వీట్ లో తన సీనియర్ సహచరుడైన కుంబ్లేకి సెహ్వాగ్ సారీ చెప్పాడు.

అప్పట్లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్ లో కుంబ్లే 87 పరుగుల వ్యక్తిగత స్కోరుపై ఉండగా, దూకుడుగా ఆడాలంటూ సెహ్వాగ్ ఇచ్చిన సలహా వికటించింది. సెహ్వాగ్ చెప్పడంతో ధాటిగా ఆడబోయి ఆ తర్వాత బంతికే కుంబ్లే అవుటయ్యాడు. ఆ విధంగా కుంబ్లే తన టెస్టు కెరీర్ లో రెండో సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్నాడు. కుంబ్లే సెంచరీ మిస్ కావడానికి తానే కారణం అని భావిస్తున్నానని, అందుకు కుంబ్లే తనను క్షమించాలని తాజాగా సెహ్వాగ్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించాడు. క్రికెట్ లో సెంచరీ మిస్సయినా నిజ జీవితంలో మీరు సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నానని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. దీనికి కుంబ్లే ఎంతో హుందాగా స్పందించాడు. నువ్వెప్పుడూ ఎంతో ఫన్నీగా మాట్లాడతావు సెహ్వాగ్ అంటూ జవాబిచ్చాడు.

More Telugu News