Cricket: క్రికెట్ మ్యాచ్ చూడడానికి రండి.. మోదీ, షేక్‌ హసీనాలకు 'క్యాబ్‌' ఆహ్వానం

  • వచ్చే నెలలో భారత్, బంగ్లాదేశ్‌ మధ్య టెస్టు మ్యాచ్
  • రెండో టెస్టుకు ఇరు దేశాల ప్రధానులకు ఆహ్వానం
  • ఈడెన్‌ గార్డెన్స్‌లో బంగ్లాకు తొలి టెస్ట్ మ్యాచ్

వచ్చే నెలలో భారత్, బంగ్లాదేశ్‌ మధ్య టెస్టు మ్యాచ్ సిరీస్ జరగనుంది. నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనాలకు ఆహ్వానం పంపాలని క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ (క్యాబ్‌) నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగనుంది. ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడటం బంగ్లాదేశ్‌ కు ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీంతో ఇరు దేశాల ప్రధానులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని క్యాబ్ నిర్ణయించింది.

 క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈడెన్‌లో గంట కొట్టి మ్యాచ్‌ ప్రారంభించే పద్ధతిని ఆయన ప్రవేశపెట్టాడు. గతంలో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాక్ తో జరిగిన మ్యాచ్‌కు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ను క్యాబ్‌ ఆహ్వానించింది. ప్రపంచకప్‌-2011 సెమీఫైనల్‌లో మొహాలీలో జరిగిన మ్యాచ్ కు అప్పటి భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూసఫ్‌ రజా గిలానీలు హాజరై మ్యాచ్ ను చూసిన విషయం తెలిసిందే.

More Telugu News