Ganguly: ధోనీ భవిష్యత్తుపై బీసీసీఐ కాబోయే అధ్యక్షుడు గంగూలీ స్పందన

  • ఈ నెల 23న బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించనున్న గంగూలీ
  • ధోనీ గురించి సెలక్టర్ల అభిప్రాయం తెలుసుకుంటానన్న దాదా
  • ధోనీతో కూడా మాట్లాడతానంటూ వ్యాఖ్య

భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నెల 23న కొత్త అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలను స్వీకరించబోతున్నారు. క్రికెట్ లో ఎంతో అనుభవం ఉన్న గంగూలీ ఈ బాధ్యతలను స్వీకరించనుండటంతో... భారత క్రికెట్ లో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, బీసీసీఐలోకి గంగూలీ ఎంట్రీ ఇవ్వడంతో... ఇప్పుడు చర్చ మొత్తం టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీపై సాగుతోంది. ధోనీకి గంగూలీ చెక్ పెట్టడం ఖాయమనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో, ధోనీ భవితవ్యం గురించి మీడియా సమావేశంలో గంగూలీ మాట్లాడారు. ఈ నెల 24న సెలక్టర్లతో తాను భేటీ కానున్నానని చెప్పారు. ధోనీ గురించి ఆ సమావేశంలో సెలక్టర్ల అభిప్రాయాన్ని తెలుసుకుంటానని... ఆ తర్వాత ధోనీతో కూడా మాట్లాడతానని తెలిపారు. ఈ సమావేశంలో కెప్టెన్ కోహ్లీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు, మారిన నిబంధనల కారణంగా ఈ సమావేశానికి కోచ్ రవిశాస్త్రి అందుబాటులో ఉండకపోవచ్చని గంగూలీ తెలిపారు.

More Telugu News