UK: పోర్న్ వెబ్‌సైట్లపై యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం.. గతంలో ఇచ్చిన ఆదేశాలు వెనక్కి!

  • వయసు ధ్రువీకరణ ఉంటేనే సైట్‌లోకి వెళ్లేలా నిబంధనలు
  • అభ్యంతరాలు వ్యక్తం చేసిన పోర్న్ పరిశ్రమ
  • 18 ఏళ్లు నిండిన వారికే ప్రవేశం ఉండాలన్న నిబంధన వెనక్కి

పోర్న్ వెబ్‌సైట్ల విషయంలో గతంలో చేసిన ఆదేశాలను బ్రిటన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆయా సైట్లలోకి వెళ్లేందుకు 18 ఏళ్లు నిండిన వారినే అనుమతించాలంటూ పోర్న్‌సైట్లను ప్రభుత్వం గతంలో ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల 18 ఏళ్ల లోపున్న వారు అయా సైట్లలోకి వెళ్లేందుకు అనుమతి లభించదని ప్రభుత్వం భావించింది. అయితే, ఇప్పుడా నిబంధనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో పోర్న్ సైట్ల నిర్వాహకుల పంట పండినట్టే అయింది. పోర్న్ సైట్లలో అత్యధిక భాగం యూకే, యూఎస్ కేంద్రంగా నడుస్తున్నవే.

కాగా, 18 ఏళ్ల పైబడిన వారే ఈ సైట్లను చూడాలన్న నిబంధన ఉన్నా.. ఆయా సైట్లు దీనిని మొక్కుబడి వ్యవహారంగానే చూస్తున్నాయి. బాలలు సైతం తాము 18 ఏళ్ల పైబడిన వారమేనని చెబుతూ వాటిలోకి ప్రవేశించి యథేచ్ఛగా పోర్న్‌ను వీక్షిస్తున్నారు. దీంతో కఠిన నిబంధనలు అమలు చేయాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన వారే వెబ్‌సైట్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పోర్న్ సైట్ల నిర్వాహకులను హెచ్చరించింది.

దీంతో నిర్వాహకులు 18ప్లస్ ఉన్నవారే సైట్‌లోకి వెళ్లాలంటూ ఓ నోటిఫికేషన్ బాక్స్‌ను సిద్ధం చేశారు. అయితే, బాలలు కూడా తప్పుడు వివరాలతో అందులోకి లాగిన్ అవుతున్నారు. దీంతో స్పందించిన ప్రభుత్వం దీనికి అడ్డుకట్ట వేసేందుకు పోర్న్ సైట్లలోకి వెళ్లేవారు తమ పాస్‌పోర్ట్ వివరాలు, క్రెడిట్ కార్డు, వయసును ధ్రువీకరించే ఇతర కార్డుల వివరాలను నమోదు చేయాలని ఆదేశించింది.

వ్యక్తిగత వివరాలను ఇచ్చేందుకు ఎవరూ ఇష్టపడరని, కాబట్టి వాటిలోకి వెళ్లేవారి సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ ఆదాయానికి గండిపడుతుండడంతో పోర్న్ పరిశ్రమ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే, పిల్లలు ఆయా సైట్లలోకి ప్రవేశించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News