Sourav Ganguly: భజ్జు, నీ సహకారం కావాలి: సౌరవ్ గంగూలీ

  • బీసీసీఐ అధ్యక్షుడిగా కొత్త ఇన్నింగ్స్ కు సిద్ధమైన సౌరవ్
  • శుభాకాంక్షలు తెలిపిన మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్
  • భారత క్రికెట్లో తిరిగి సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు కృషిచేస్తాను
  • 23న బాధ్యతలు చేపట్టనున్న మాజీ కెప్టెన్

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి)  కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. గంగూలీకి పోటీగా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో పోటీ లేకుండగానే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అక్టోబర్ 23న గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా గంగూలీ కెప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్ లో రాణించిన సహచర ఆటగాడు హర్భజన్ సింగ్ నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. ‘నీవు అసలైన నాయకుడవు. ఇతరులు కూడా నీలాగా సాధికారత సాధించాలని కోరుకుంటారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు’ అని హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు.

హర్భజన్ ట్వీట్ కు గంగూలీ బదులిస్తూ ‘ధన్యవాదాలు భజ్జు. నీ బౌలింగ్ తో భారత్ గెలుపునకు ఎలా అయితే కృషి చేశావో, ఇకముందు కూడా నీవు నాకు అలాగే సహకారం అందించాలి’ అంటూ రీ ట్వీట్ చేశారు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేయనున్న సందర్భంగా తన సహచర ఉద్యోగుల ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

వీరిలో జయ్ షా, అరుణ దుమల్, జయేష్ జార్జి, మహిం వర్మ ఉన్నారు  ఈ పదవికి గంగూలీ ఎంపికయ్యేందుకు బోర్డు మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కీలక భూమిక పోషించారు. సోమవారం నామినేషన్ వేసిన అనంతరమే.. గంగూలీ తన గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు. అధ్యక్షుడిగా తాను భారత క్రికెట్లో సాధారణ పరిస్థితులు తీసుకురావాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా పేరును ప్రస్తావిస్తూ గంగూలీ .. బీసీసీఐ అధ్యక్షుడిగా దాల్మియా సాధించిన విజయాల మాదిరిగానే, తాను కూడా సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. దాల్మియా బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్లకు అధ్యక్షుడిగా పనిచేసిన సమయాల్లో నేను క్రికెట్ ఆడుతున్నాను. ఆయనతో అంతగా సాన్నిహిత్యం దొరకలేదు. పరిపాలన పరంగా దాల్మియా సాధించిన విజయాల్లో నేను 50 శాతం సాధిస్తే అదే గొప్ప' అంటూ 47 ఏళ్ల గంగూలీ వ్యాఖ్యానించారు.

More Telugu News