India: విమానాన్ని అవలీలగా లాగేసే టాక్సిబాట్ ఇప్పుడు భారత్ లో...!

  • టాక్సిబాట్ తో విమానాల్లో ఇంధనం ఆదా
  • విమానాన్ని సులువుగా టేకాఫ్ పాయింట్ కు తరలింపు
  • టాక్సిబాట్ సేవలందుకున్న ఎయిరిండియా విమానం

ఇజ్రాయెల్ ఏరోస్పేస్ సంస్థ ఓ ఫ్రెంచ్ కంపెనీతో సంయుక్తంగా రూపొందించిన టాక్సిబాట్ ఇప్పుడు భారత్ లో సేవలు అందిస్తోంది. టాక్సిబాట్ అంటే విమానాశ్రయాల్లో పార్కింగ్ టెర్మినల్స్ వద్ద ఉన్న విమానాలను నేరుగా టేకాఫ్ పాయింట్ల వద్దకు చేర్చే ట్రాక్టర్ వంటి వాహనం. దీని ద్వారా విమానాల్లో ఇంధనం ఎంతో ఆదా అవుతుంది. టెర్మినల్ నుంచి విమానం టేకాఫ్ పాయింట్ వద్దకు చేరుకోవాలంటే ఇంజిన్లు ఆన్ చేసి నిదానంగా వెళ్లాల్సి ఉంటుంది. దీని వల్ల ఎంతో ఇంధనం ఖర్చవుతుంది. అదే టాక్సిబాట్ కు విమానాన్ని అనుసంధానిస్తే ఇంధనం ఎంతో పొదుపు చేయొచ్చు.

టాక్సిబాట్ విమానం ముందు టైరును లిఫ్ట్ చేసి విమానాన్ని నెట్టుకుంటూ వెళుతుంది. టేకాఫ్ పాయింట్ నుంచి టెర్మినల్ వరకు, టెర్మినల్ నుంచి టేకాఫ్ పాయింట్ వరకు విమానాలను సులువుగా తరలిస్తుంది. టాక్సిబాట్ ను విమానంలో ఉన్న పైలెట్ నియంత్రిస్తాడు. ఇప్పటివరకు ప్రపంచంలో టాక్సిబాట్ సేవలను రవాణా విమానాలకే ఉపయోగించారు. అయితే ప్రపంచంలోనే తొలిసారిగా ఓ ప్రయాణికుల విమానాన్ని టాక్సిబాట్ తో అనుసంధానం చేసింది భారత్ లోనే కావడం విశేషం అని చెప్పాలి. ఈ ఘనత ఎయిరిండియాకే దక్కింది. ఎయిరిండియాకు చెందిన ఎయిర్ బస్ ఏ320 విమానాన్ని టాక్సిబాట్ టేకాఫ్ పాయింట్ కు చేర్చింది.

More Telugu News