Chandrababu: చంద్రబాబుకు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసేసింది: కన్నా లక్ష్మీనారాయణ

  • చంద్రబాబు పెద్ద అవకాశవాది
  • 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకుని సమాధి చేశారు
  • 2014లో కూడా బీజేపీని లేకుండా చేయాలని చూశారు

రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆశ తనకు లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పెదవి విరిచారు. కర్నూలులో గాంధీ సంకల్పయాత్రను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా అభివృద్ధి, సంక్షేమం కలగా మిగిలిపోయే పరిస్థితి ఉందని అన్నారు.

 కేంద్ర ప్రభుత్వంతో వైరం పెట్టుకోవడం వల్లే మొన్నటి ఎన్నికల్లో తాము ఓడిపోయామని చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలకు కన్నా బదులిస్తూ.. చంద్రబాబు పెద్ద అవకాశవాది అని, ఏరోజు ఏం మాట్లాడతాడో తెలియని పరిస్థితి అని విమర్శలు చేశారు. 1999లో వాజ్ పేయి ఇమేజ్ ను దృష్టిని పెట్టుకుని, కాళ్లూ గడ్డాలు పట్టుకుని పొత్తుపెట్టుకుని బీజేపీని సమాధి చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అలాగే, 2014లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని ఈ పార్టీని ఏపీలో శాశ్వతంగా లేకుండా చేయాలని చూశారని ఆరోపించారు. ఏపీలో బీజేపీ బలపడకూడదన్నది చంద్రబాబు ప్రధాన లక్ష్యంగా కనబడుతోందని విమర్శించారు. ఏపీలో ఈరోజు బీజేపీ చిగురిస్తోందని, ఇలాంటి సమయంలో చంద్రబాబు కొత్త ఎత్తు వేశారని, మళ్లీ బీజేపీని ఎదగనీయకుండా చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిసారి మోసపోవడానికి బీజేపీ సిద్ధంగా లేదని అన్నారు. చంద్రబాబుకు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసేసిందన్న మాటను మొన్న నరసరావుపేట పర్యటనకు వచ్చిన అమిత్ షా స్పష్టం చేశారని అన్నారు.

More Telugu News