Assembly: ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ నిషేధం: ఈసీ

  • 21న రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
  • 17 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు 
  • పోలింగ్ ముగిసేవరకు ఆదేశాలు వర్తింపు

ఈ నెల 21న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానా, మహారాష్ట్ర సహా, ఉప ఎన్నికలు జరుగనున్న17 రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ ను నిషేధిస్తున్నట్లు భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల కమిషన్ అధికార ప్రతినిధి ఎస్.శరణ్ ఈ మేరకు వివరాలను ట్వీట్ చేశారు. 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం వర్తిస్తుందని అన్నారు. పోలింగ్ గడువు ముగిసే వరకు ఒపీనియన్ పోల్స్ ఫలితాలు, పోల్ సర్వేలు కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయకుండా నిషేధించామని శరణ్ పేర్కొన్నారు.

మొత్తం 429 అసెంబ్లీ, 2 పార్లమెంటరీ నియోజక వర్గాల్లో పోలింగ్

హర్యానాలోని 90 అసెంబ్లీ నియోజక వర్గాలు, మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలు సహా అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి మొత్తం 429  నియోజక వర్గాల్లో పోలింగ్ ఈ నెల 21న జరుగనుంది. వీటితోపాటు బీహార్ లోని సమస్తిపూర్, మహారాష్ట్రలోని సతారా పార్లమెంటరీ నియోజకవర్గాలకూ అదే రోజు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల ఫలితాలను 24న ప్రకటిస్తారు.

More Telugu News