tsrtc: తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం: జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి

  • ప్రభుత్వం, యాజమాన్యం ఎవరు పిలిచినా వెళ్తాం
  • చర్చలు జరపకుండా సమ్మె విరమణ కుదరదు
  • సమ్మె యథావిధిగా కొనసాగుతుంది

టీఎస్సార్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు ముగిసిన అనంతరం జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం, యాజమాన్యం ఎవరు పిలిచినా చర్చలకు వెళ్తామని, ప్రస్తుతానికి సమ్మె యథావిధిగా కొనసాగుతుందని అన్నారు.

కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, అలాగే, ప్రభుత్వం చర్చలు జరిపితే సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉండాలని కార్మికులకు కోర్టు సూచించినట్టు చెప్పారు. ప్రభుత్వం చర్చలు జరపకుండా సమ్మె విరమించే ప్రసక్తే లేదని, సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోందని, కేకే కమిటీ లేదా ఎలాంటి కమిటీలు గానీ తమతో చర్చలు జరపలేదని అన్నారు. ఈ కేసు తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 18వ తేదీన కోర్టుకు హాజరవుతామని చెప్పారు.

More Telugu News