PMC Bank: సంక్షోభంలో పీఎంసీ బ్యాంక్.. రూ.90 లక్షల డిపాజిట్ తిరిగి రాదన్న ఆందోళనతో గుండెపోటుతో ఖాతాదారు మృతి

  • ముంబైలో పీఎంసీ బ్యాంకు డిపాజిట్ దారు సంజయ్ గులాటి
  • వేల కోట్ల నిరర్థక  ఆస్తులతో సంక్షోభంలో బ్యాంక్
  • ఆదుకుంటామంటున్న ముఖ్యమంత్రి పఢ్నవీస్

తాము డిపాజిట్ చేసిన డబ్బు తిరిగిరాబట్టు కోవాలన్న తపనతో మిగతా డిపాజిట్ దారులతో కలిసి ధర్నాచేస్తున్న సమయంలో ఉద్విగ్నతకు గురైన సంజయ్ గులాటి(51)   గుండె పోటుతో మరణించాడు. నిరర్థక అస్తుల సమస్యతో సతమతమవుతున్న ముంబైలోని  పంజాబ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ డిపాజిట్ దారుల విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రస్తుతం ఈ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలో ఉంది.

ఈ నేపథ్యంలో సోమవారం డిపాజిట్ దారులు బ్యాంకు  ఎదుట నిరసనలు చేపట్టారు. గులాటి  ఈ బ్యాంకులో రూ.90 లక్షలకు పైగా డిపాజిట్లు చేశారు. జెట్  ఎయిర్ వేస్ లో ఇంజినీర్ గా పనిచేస్తున్న గులాటి జెట్ ఎయిర్ వేస్ సంస్థ మూత పడటంతో తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. గులాటి తన 80 ఏళ్ల తండ్రితో కలిసి ధర్నాలో పాల్గొన్నాడు. గులాటి బంధువులు, అతని పొరుగువారు సైతం భారీ ఎత్తున ఈ బ్యాంకులో డిపాజిట్లు చేశారు. ఈ బ్యాంకు సంక్షోభంలో పడటానికి కారణం రియల్ ఎస్టేట్ సంస్థ హెచ్ డీఐఎల్ రుణాలు రూ. 4355 కోట్లు తీసుకుని తిరిగి చెల్లించలేకపోయింది. దీనితో పీఎంసీ బ్యాంకు సంక్షోభంలో పడింది.

రాష్ట్రంలో అసెంబ్లీ  ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని దేవేంద్ర పఢ్నవీస్ పీఎంసీ బ్యాంకు విషయంలో జోక్యం చేసుకుని డిపాజిట్ దారులకు న్యాయం చేస్తానని అంటున్నారు. బీజేపీ మ్యానిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చుతున్నట్లు ప్రకటించారు. ఈ బ్యాంకులో మొత్తం రూ.11వేల కోట్లకు పైగా డిపాజిట్లున్నాయి. ముంబైలో అన్ని ప్రాంతాల్లో డిపాజిట్ దారులు బ్యాంకుకు వ్యతిరేకంగా నిరసనలు ఉద్ధృతం చేస్తున్నారు.

More Telugu News