Pranjala Patil: అంధురాలు ప్రాంజల్ పాటిల్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం పట్ల చంద్రబాబు వ్యాఖ్యలు

  • తిరువనంతపురం జిల్లాలో నియమితులైన ప్రాంజల్ 
  • ప్రాంజల్ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అంటూ కొనియాడిన చంద్రబాబు
  • ట్విట్టర్ లో శుభాకాంక్షలు

దేశంలోనే తొలి అంధ ఐఏఎస్ అధికారిగా ఖ్యాతిపొందిన ప్రాంజల్ పాటిల్ కేరళలో తిరువనంతపురం జిల్లా సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. చూపు లేకపోయినా అకుంఠిత పట్టుదలతో ఆమె అత్యున్నత సర్వీసును సాధించిన తీరు దేశవ్యాప్తంగా ప్రశంసలకు కారణమైంది.

దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోషల్ మీడియాలో స్పందించారు. కేరళలో సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రాంజల్ పాటిల్ కు శుభాభినందనలు తెలుపుతున్నట్టు ట్విట్టర్ లో పేర్కొన్నారు. "ఒక్కసారి మనసు లక్ష్యంపై నిమగ్నమైతే మరేదీ అడ్డంకి కాబోదని దేశంలోనే మొట్టమొదటి అంధ ఐఏఎస్ అధికారిగా నియమితులవడం ద్వారా మీరు నిరూపించారు. ప్రాంజల్ పాటిల్, మీరు నిజంగా స్ఫూర్తిదాయకమైన వ్యక్తి" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

  ప్రాంజల్ పాటిల్ 2017లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో 124వ ర్యాంక్ సాధించి తొలుత ఎర్నాకుళం అసిస్టెంట్ కలెక్టర్ గా నియమితులయ్యారు. అంతకుముందు, 2016లో యూపీఎస్సీ ఎగ్జామ్ రాసిన ఆమెకు 773వ ర్యాంక్ రాగా, భారత రైల్వే శాఖలో అకౌంట్స్ విభాగంలో నియామకం వచ్చింది. కానీ ఆమె అంధురాలన్న కారణంగా అధికారులు ఉద్యోగం నిరాకరించారు.

మహారాష్ట్రలోని ఉల్హాస్ నగర్ కు చెందిన ప్రాంజల్ పాటిల్ ఆరేళ్ల వయసు వచ్చేసరికి పూర్తిగా దృష్టిని కోల్పోయారు. అయితే చదువుకోవాలన్న బలమైన ఆకాంక్ష ఆమెను ముందుకు నడిపింది. ముంబయిలోని సెయింట్ జేవియర్ కళాశాలలో పొలిటికల్ సైన్స్ తో డిగ్రీ పూర్తిచేసిన ప్రాంజల్, ఆ తర్వాత ఢిల్లీ జేఎన్యూ లో 'అంతర్జాతీయ సంబంధాలు' ప్రధాన సబ్జెక్టుగా ఎంఏ పూర్తి చేశారు. ఓ ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ సాయంతో పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని కంప్యూటర్ లో నిక్షిప్తం చేసుకుని, వినడం ద్వారా విద్యాభ్యాసం పూర్తిచేయగలిగానని ప్రాంజల్ మీడియాతో చెప్పారు.

More Telugu News