keshava rao: ఆర్టీసీకి, ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తిత్వానికి ఓకే: కె.కేశవరావు

  • ఈ విషయంపై కేసీఆర్ ఇప్పటి వరకు నన్ను పిలవలేదు
  • ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా నన్ను కలవలేదు
  • కార్మికుల డిమాండ్లపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరాను

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి, చర్చలకు రావాలంటూ నిన్న టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాను చేసిన ఈ వ్యాఖ్యలపై ఆయన ఈ రోజు మరోసారి స్పందించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ జేఏసీ నేతలతో సంప్రదింపుల విషయంలో తనను సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు పిలవలేదని స్పష్టతనిచ్చారు. ఆర్టీసీ సమ్మెతో పరిస్థితులు చేయి దాటిపోతుండడంతోనే తాను ఆ విధంగా వ్యాఖ్యానించినట్లు వివరించారు. అలాగే, తనను ఆర్టీసీ జేఏసీ నేతలు ఎవరూ కలవలేదని చెప్పారు. ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలోనే తాను చర్చలకు సిద్ధం కావాలంటూ మాట్లాడానని అన్నారు.

అయితే, ఒకవేళ కేసీఆర్ నుంచి ఆదేశాలు వస్తే తాను ఆర్టీసీ నేతలకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగేందుకు మధ్యవర్తిగా ఉంటానని కేశవరావు అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై పునరాలోచించాలని తాను ప్రభుత్వాన్ని కోరానని చెప్పారు. కాగా, కేశవరావు మధ్యవర్తిత్వం చేస్తే మంచిదేనని, తాము చర్చలకు వస్తామని నిన్న టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.

More Telugu News