Pakistan: పాక్ కు మరిన్ని కష్టాలు.. 'డార్క్ గ్రే' లిస్టులో పెట్టనున్న ఎఫ్ఏటీఎఫ్!

  • ఉగ్రవాద నిరోధానికి గతంలో పాక్ కు ఎఫ్ఏటీఎఫ్  27 సిఫార్సులు 
  • ఆరింటిని మాత్రమే అమలు
  • డార్క్ గ్రే లిస్టులో పెట్టే అవకాశం

ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారిన పాకిస్థాన్ ను బ్లాక్ లిస్టులో పెట్టడానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందే మార్గాలను నిరోధించే ఎఫ్ఏటీఎఫ్.. ఫ్రాన్స్ వేదికగా పనిచేస్తుంది. ప్రస్తుతం ప్యారిస్ లో ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ సమావేశాల్లో పాక్ కు ఒక్క సభ్య దేశం కూడా మద్దతు ఇవ్వలేదు. గతంలో ఈ సంస్థ పాక్ ను గ్రే లిస్టులో పెట్టి, ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకోసం మొత్తం 27 సిఫార్సులు చేయగా, వాటిలో పాక్ ఆరింటిని మాత్రమే అమలు చేసింది. దీంతో ఆ దేశాన్ని డార్క్ గ్రే లిస్టులో పెట్టాలని ఎఫ్ఏటీఎఫ్ భావిస్తోంది.

ఏ దేశాన్నైనా బ్లాక్ లిస్టులో పెట్టడానికి  ముందు డార్క్ గ్రే లిస్ట్ లో పెట్టొచ్చు. అనంతరం బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశం ఉంటుంది. మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాలను అరికట్టేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న పోరాటానికి ఏ దేశమైనా సహకరించకపోతే  బ్లాక్ లిస్టులో పెడతారు. పాక్ ను ఎఫ్‌ఏటీఎఫ్ ఈ లిస్టులోకి చేర్చితే అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటివి పాక్ కు గ్రేడ్ తగ్గిస్తాయి. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. ప్యారిస్ లో ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఉచ్చులోంచి తప్పించుకోవడానికి పాక్ ఇటీవల పలువురు ఉగ్రవాద నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

More Telugu News