tsrtc: దేశవ్యాప్తంగా ఉన్న రవాణా రంగ కార్మికులను ఉద్యమానికి సిద్ధం చేస్తాం: ఏపీఎస్‌ఆర్టీసీ

  • ఈ నెల 19న ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతాం
  • భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేస్తాం
  • టీఎస్ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం  

తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ కొన్ని రోజులుగా టీఎస్ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఈ రోజు విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) కన్వీనర్‌ దామోదరరావు మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈ నెల 19న ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని తెలిపారు. అదే రోజున తమ జేఏసీ సమావేశమై చర్చించి, తమ భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేస్తుందని చెప్పారు.
 
టీఎస్ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని, వారు ధైర్యంగా ఉండాలని దామోదరరావు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న రవాణా రంగ కార్మికులను అందరినీ ఉద్యమానికి సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. టీఎస్ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. వారి సమ్మెకు తాము సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశారు.

More Telugu News