Cricket: క్రికెట్ లో మారిన సూపర్ ఓవర్ నిబంధనలు!

  • సూపర్ ఓవర్ నిబంధనలపై విమర్శలు
  • బౌండరీల లెక్కతో విజేతలను తేల్చడంపై పలువురి ఆగ్రహం
  • విజేత తేలేవరకూ సూపర్ ఓవర్ వేయించాలని ఐసీసీ నిర్ణయం

ప్రస్తుతం క్రికెట్ లో అమలులో వున్న సూపర్ ఓవర్ నిబంధనలపై సర్వత్ర విమర్శలు వస్తుండడంతో నిబంధనలు మార్చడానికి ఐసీసీ నిర్ణయం తీసుకుంది. రెండు జట్ల మధ్య స్కోర్ సమంగా వున్నప్పుడు సూపర్ ఓవర్ వేయిస్తారు. అయితే, అప్పుడు కూడా స్కోర్లు సమంగా వుంటే కనుక ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టును విజేతగా ప్రకటిస్తున్నారు. మొన్న ప్రపంచ కప్ ఫైనల్ లో కూడా ఇలాగే జరిగింది. అయితే, ఈ బౌండరీలను లెక్కించడాన్ని పలువురు విమర్శిస్తుండడంతో ఇప్పుడు దీనిని మార్చేశారు.  

 సూపర్ ఓవర్ కూడా టై అవుతుంటే, ఫలితం వచ్చేంత వరకూ సూపర్ ఓవర్లను ఆడిస్తూనే ఉండాలని ఐసీసీ స్పష్టం చేసింది. నాకౌట్ దశలో మాత్రమే ఆడిస్తున్న సూపర్ ఓవర్లు ఇకపై లీగ్ దశలోనూ ఉంటాయని, ఒకసారి సూపర్ ఓవర్ టై అయితే, మ్యాచ్ టై అయినట్టేనని ఐసీసీ పేర్కొంది. జింబాబ్వే, నేపాల్ జట్లపై గతంలో విధించిన నిషేధాన్ని తొలగిస్తున్నట్టు వెల్లడించింది.

ఇక మహిళల క్రికెట్ పోటీలకు ఇస్తున్న బహుమతి మొత్తాన్ని భారీగా పెంచుతూ కూడా ఐసీసీ బేరర్లు నిర్ణయం తీసుకున్నారు. టీ-20 వరల్డ్ కప్ పోటీల్లో విజేతకు రూ. 7 కోట్లు, రన్నరప్ కు రూ. 3.5 కోట్లు ఇవ్వనున్నారు. వన్డే ప్రపంచ కప్‌ మొత్తం ప్రైజ్‌ మనీని రూ. 24.8 కోట్లకు పెంచాలని కూడా ఐసీసీ నిర్ణయించింది.

More Telugu News