bhuma akhilapriya: నా భర్త కనిపించడం లేదు.. మాజీ మంత్రి అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు

  • కేసులు ఎదుర్కోవడం మాకు కొత్తకాదు
  • భార్గవ్‌రామ్ ఏ తప్పూ చేయలేదు
  • వార్నింగ్ ఇవ్వాలనుకుంటే మంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చేవాళ్లం

కేసులు నమోదైన తర్వాత నుంచి తన భర్త భార్గవ్‌రామ్ ఎక్కడ ఉన్నారో తెలియదని, తనతో టచ్‌లో లేరని ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. పారిపోవాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు. భార్గవ్‌రామ్‌పై నమోదైనవి తప్పుడు కేసులేనన్న విషయం పోలీసులకు కూడా తెలుసన్నారు. క్రషర్‌లో ఆయనకూ భాగం ఉందని, ఆయన ఎవరిపైనా దాడి చేయలేదని అఖిలప్రియ స్పష్టం చేశారు. నిజానికి క్రషర్ వివాదం సివిల్ విషయమని, కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయ్యేదని అన్నారు.

ఒకవేళ తాము వార్నింగ్ ఇవ్వాలనుకుంటే మంత్రిగా ఉన్నప్పుడే ఆ పనిచేసేవాళ్లమని అఖిలప్రియ అన్నారు. తప్పుడు కేసులు బనాయించడం, ఆస్తులు లాక్కోవడం వంటి పనులకు తాము ఎప్పుడూ పాల్పడలేదని, ఈ విషయం ఆ క్రషర్ భాగస్వామికి కూడా తెలుసని అన్నారు. తమ కుటుంబానికి మంచి పేరుందన్నారు. తన భర్తపై కేసులు పెట్టిన వారిలో వైసీపీ నేతలు కూడా ఉన్నారని అఖిలప్రియ ఆరోపించారు.

ముఖ్యమంత్రి జగన్ చెప్పకుండా తెలంగాణలో కేసులు పెట్టడం సాధ్యం కాదని పేర్కొన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తాము పులివెందుల వెళ్లినందుకే ఇలా కేసులు పెడుతుండవచ్చని అఖిలప్రియ అనుమానం వ్యక్తం చేశారు. కేసులు తమకు కొత్తకాదని, ఇంతకంటే దారుణమైన పరిస్థితులను కూడా తాము ఎదుర్కొన్నామని తెలిపారు. న్యాయ పోరాటం చేస్తున్నామని, తమకు న్యాయం జరుగుతుందని అఖిలప్రియ ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News