Viveka: వివేకా హత్యతో సంబంధం లేనివారిని నిందితులుగా చూపించబోతున్నారు: వర్ల రామయ్య ఆరోపణ

  • గుంటూరులో మీడియా సమావేశం
  • వివేకా హత్య కేసు నిందితులు జగన్ కు తెలుసని వ్యాఖ్యలు
  • సీబీఐ విచారణ ఎందుకు కోరడంలేదని ప్రశ్నించిన వర్ల

వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. వివేకా హత్యకేసులో దోషులను దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, హత్యతో సంబంధం లేనివారిని నిందితులుగా చూపించబోతున్నారని ఆరోపించారు. వివేకాను చంపింది ఎవరో జగన్ కు, వివేకా కుమార్తె సునీతకు తెలుసని అన్నారు. వివేకా హత్య జరిగిన వెంటనే సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడడం లేదని వర్ల రామయ్య నిలదీశారు.  

సీఎం చిన్న సంతకం చేస్తే అసలు నేరస్తులు ఎవరో బయటికి వస్తారని, కానీ ప్రభుత్వం అసలు నిందితుల్ని దాచిపెట్టి అమాయకుల్ని బలి చేయాలని కోరుకుంటోందని, అందుకే సీబీఐ విచారణ కోరడంలేదని అన్నారు. పులివెందులలో ఎవర్ని అడిగినా వివేకాను చంపిందెవరో చెబుతారని, కానీ ఈ హత్యకేసును తారుమారు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News