అప్పుడే బెంజ్ కారు కొనేసిన నభా నటేశ్!

14-10-2019 Mon 15:05
  • తొలి రెండు సినిమాలు హిట్లే
  • చేతిలో మరో రెండు సినిమాలు
  • గ్లామర్ పరంగా మంచి మార్కులు
తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన బొద్దు గుమ్మలలో నభా నటేశ్ ఒకరు. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో కుర్రకారు మనసులను దోచేసిన నభా, ఆ తరువాత సినిమాగా 'ఇస్మార్ట్ శంకర్' చేసి హిట్ కొట్టేసింది. ఈ సినిమాలో మాస్ హీరోయిన్ గా గ్లామర్ పరంగా ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. 'ఇస్మార్ట్ శంకర్' హిట్ తో నభా మరో మెట్టు పైకెక్కేసింది.

ఈ సినిమా అందించిన సక్సెస్ కి గుర్తుగా అన్నట్టుగా తాజాగా ఆమె ఒక బెంజ్ కారు కొనేసింది. కొత్త కారు కొనేసిన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం నభా నటేశ్ తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. రవితేజ సరసన 'డిస్కోరాజా' ..  సాయిధరమ్ తేజ్ జోడీగా 'సోలో బతుకే సో బెటర్' అనే సినిమాలు సెట్స్ పై వున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా హిట్ కొడితే, ఇక ఇప్పట్లో నభాను పట్టుకోవడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.